India vs Australia 1st Test Highlights: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ జట్టు ఇన్నింగ్స్ తేడాతో శనివారం ఘన విజయం సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబర్చిన టీమిండియా ఇన్నింగ్స్, 132 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. దాంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0తో భారత్ జట్టు ఆధిక్యంలో నిలవగా.. రెండో టెస్టు మ్యాచ్ శుక్రవారం (ఫిబ్రవరి 17) నుంచి ఢిల్లీ వేదికగా జరగనుంది.గురువారం ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీమ్ 177 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ జట్టులో లబుషేన్ (49) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. భారత్ బౌలర్లలో జడేజా 5 వికెట్లు, అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా గురువారం చివరి సెషన్, శుక్రవారం మూడు సెషన్‌లు, ఈరోజు ఒక సెషన్ బ్యాటింగ్ చేసి 400 పరుగులకి ఆలౌటైంది. దాంతో 223 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం టీమిండియా లభించింది.ఈరోజు రెండో సెషన్‌లో 223 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా టీమ్ వరుసగా వికెట్లు చేజార్చుకుని 91 పరుగులకే ఆలౌటైంది. భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ (5/37), రవీంద్ర జడేజా (2/34), దెబ్బకి రెండో ఓవర్ నుంచే వరుసగా వికెట్లు చేజార్చుకున్న ఆస్ట్రేలియా కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (5), డేవిడ్ వార్నర్ (10), మార్కస్ లబుషేన్ (17), మాట్ రెన్షా (2), పీటర్ హ్యాండ్స్‌కబ్ (6), అలెక్స్ క్యారీ (10), పాట్ కమిన్స్ (1), టాడ్ మర్ఫీ (2) వరుసగా పెవిలియన్‌కి క్యూ కట్టారు.